యోగా ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం. యోగా సాధన ద్వారా శరీరంలోని జీవ క్రియలను నియంత్రణలో ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. క్షణం తీరికలేని నేటి జీవన విధానంలో మనిషి ఆయుష్షు తగ్గిపోయింది. బతికినన్ని రోజులు కూడా అనేక రోగాలతో బాధపడుతూ రోజూ నరకం అనుభవిస్తున్నాడు. శారీరక వ్యాయామం తగ్గడంతోనే ఈ దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి.
ఈ సమస్యలన్నింటికీ యోగా సాధన ద్వారా పరిష్కారం లభిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. రోగం వచ్చిన తరువాత చికిత్స కోసం పరుగులు తీసేకంటే రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా సాధన ఉపకరిస్తుంది. అందుకే యోగాలోని ముఖ్యమైన కొన్ని ఆసనాల గురించి టీ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం...
యోగాలో భాగమైన ప్రాణాయామం, శవాసనం చాల ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వీటి సాధన కూడా చాలా సులభం. కొద్దిపాటి అవగాహనతో ప్రతి ఒక్కరు వీటిని సాధన చేయవచ్చు.
ప్రాణాయామం
పాణం +ఆయామం... పాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి ఆయామం అంటే విస్తరింపచేయుట, లేక నియంత్రించుట అని అర్థం. ఉచ్వాస, నిశ్వాసలను నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయం భవేత్ అన్నారు. అంటే ప్రాణాయామం నియమబద్దంగా ఆచరిస్తే సర్వరోగాలు తొలగిపోతాయి. ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానమను ఐదు రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదానానికి స్థానం కంఠం. వ్యానానికి శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం, అని లోపలికి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచాడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు. మెడికల్ సైన్స్ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే కాని యోగులు ఈ రెండింటికీ మధ్య గల భేదం గ్రహించారు.
వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రం నుంచి పీల్చు గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని సూర్యనాడి లేక సూర్య స్వరం అని అన్నారు. ఎడమ ముక్కు రంధ్రం నుంచి పీల్చే గాలి చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అందుకే దానిని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండింటికి మధ్య సమన్వయం సాధించే క్రియకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. దీని నుంచే హఠం యోగం రూపొందింది. హఠయోగమంటే చంద్ర, సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం. ప్రాణాయామమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.
ప్రయోజనాలు...
1. ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.2. శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తాయి.
3. రక్తశుద్ధ్ధి జరిగి మలినాలు బయటికి వెళ్లిపోతాయి.
4. గుండెకు సత్తువ లభిస్తుంది.
5. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
6. ప్రేవులు, నరాలు, నాడులు శుభ్ర పడుతాయి.
7. జఠరాగ్ని పెరుగుతుంది.
8. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
9. ఆయుష్షు పెరుగుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు...
1. మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళి లేదా మెత్తని వస్త్రంపై ప్రాణాయామం చేయాలి.2. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ప్రాణాయామం చేయకూడదు.
3. మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్నచోట ప్రాణాయామం చేయకూడదు.
4. సిగరెట్టు, బీడీ, చుట్టపొగ, వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
5. పొట్ట నిండుగా ఉన్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు.
6. ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగసానాలు వేయవచ్చు. అయితే శవాసనం వేసిన తరువాత కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి.
7. ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
8. పద్మాసనం, సుఖాసానం, సిద్ధాసనం, వజ్రాసానం ప్రాణాయామానికి అనువైనా ఆసనాలు. నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
9. నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి.
10. ప్రాణాయామం చేసేటప్పుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయాలి. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వేలితో, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వేలితో మూయాలి.
11. ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయమం చేస్తున్నప్పుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
12. ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మనస్సును పూర్తిగా శ్వాస క్రియలపై కేంద్రీకరించాలి.వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
శవాసనం
మహిళలకు శవాసనం వల్ల శరీరం అంతటికీ ప్రయోజనం కలుగుతుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులైన మహిళలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. మరణించినప్పుడు మనిషి ఏ విధంగా నిశ్చలంగా పడుకుంటాడో అదే విధంగా పడుకోవాలి. ఇతర యోగాసనాలన్నింటికంటే ఇది చాలా తేలికైన ఆసనం. ఉదయం యోగాసానాలతో మాత్రమే కాదు. రాత్రి పడుకోబోయే ముందు కూడా శవాసనం వేయవచ్చు. ఆ సమయంలో ఆచరించడం వలన శరీరం, మనస్సు పూర్తిగా విశ్రాంతి పొంది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఈ ఆసనం ఆచరించే సమయంలో మనసు, శరీరం కల్లోలంగా ఉండరాదు. మనస్సును చేసే పనిమీద కేంద్రికరించాలి. ఒత్తిడితో కూడిన మనస్సుకు విశ్రాంతి అవసరమైనప్పుడు శవాసనం అమితంగా ఉపయోగపడుతుంది.
సాధనచేసే పద్ధతి...
భూమిపై వెల్లికిలా పడుకొని కాళ్లు రెండూ ఒకటి లేదా రెండడుగుల వెడల్పు చేయాలి. బోటనవేళ్లు రెండు బయటకు చూస్తున్నట్లుగా కాళ్లు ఉంచాలి. మడమలు ఒకదానికొకకి ఎదురెదురుగా ఉండాలి. రెండు చేతులు శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా ఉంచాలి. ఏవైపు అయితే హాయిగా ఉంటుందో ఆ వైపునకు మెడను తిప్పి ఉంచాలి.
ప్రయోజనాలు...
మహిళలకు రుతుస్రావం సమయంలో ప్రయోజననం కల్గిస్తుంది. కండరాలకు గాఢంగా విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. మెదడు బాగా విశ్రమిస్తుంది. ఈ సమయంలో మహిళలు ఉద్రేకంగా వేదనగా, కోపంగా, చికాకుగా, దిగులుగా, ఆందోళనగా, అలిసిపోయినట్టుగా లేదా మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా ఉన్నప్పుడు శవాసనం ఎంతో ఉపకరిస్తుంది. కండరాలు విశ్రాంతి పొంది, మనస్సు కేంద్రీకరించి ఆందోళనలు, చికాకుల నుంచి పూర్తి ఉపశమనం కల్గిస్తుంది. తిరిగి శక్తి పుంజుకుని ప్రశాంతతను, తాజాధనాన్ని ఇస్తుంది.
ఉపశమనం...
వీపు వెనుక లేదా దిగువ భాగాన లేదా పొత్తికడుపున నొప్పి ఉన్నట్లయితే శవాసనం ఉపశమనం కల్పిస్తుంది. నిరంతరం పనుల ఒత్తిడితో ఆలసటకు గురైన భాగాలపై మనస్సు కేంద్రీకరించడం వంటివి చేయవచ్చు. నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది. గర్భం ధరించిన సమయంలో ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు శవాసనం శరీరం సమతుల్యతకు దోహదం చేస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలు విశ్రాంతి పొందుతాయి.
Source: NamastheTelangana.com

No comments:
Post a Comment